story::
రాజీవ్ (సుదీప్) తన భార్య ఆరతి (అమృతా కాన్విల్కర్) కూతురు రక్ష, కొడుకు రోహన్ లతో కలిసి సముద్రపు ఒడ్డున ఓ అడవి ప్రక్కన ఉండే ఓ ఇంట్లో దిగుతారు. ఆ ఇంటి ప్రక్కనే ఉన్న అడవిలో రక్షకి ఓ బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మలో ఓ ఆత్మ ఉందని తెలియని రక్ష దాన్ని ఇంట్లోకి తీసుకువస్తుంది. ఆ బొమ్మలో ఉన్న ఆత్మ లోగడ రాజీవ్ హత్య చేయించిన మధుది. చనిపోయిన తర్వాత దెయ్యంగా మారిన మధు రాజీవ్ పై పగతో రగిలిపోతూంటూంది. రాజీవ్ భార్య ఆరతిలో ప్రవేశించి వారి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని రాజీవ్ కి చెబుతుంది. దాంతో రాజీవ్ ఎం చేసాడు...? చివరికి ఏమైంది అన్నది మిగతా కథ.
సింపుల్ గా చెప్పాలంటే ఇదొక స్టుపిడ్ సినిమా. దెయ్యం, దేవుడు ఉన్నారో లేదో అన్నది ప్రక్కన పెడితే, దెయ్యం మాత్రమే ఉందన్న రీతిలో ఈ సినిమా సాగిపోతూంది. దాంతో దైవాన్ని నమ్మేవారి మనోభావాలని దెబ్బతీసే విధంగా ఈ సినిమా ఉంది. ఈ సినిమా చూస్తుంటే రాంగోపాల్ వర్మకు పిచ్చి ముదిరి పాకానపడినట్టనిపిస్తుంది. దెయ్యాల సినిమాలు అనగానే చీకటి గదుల్లో ఒక్క సెకెన్ లో దెయ్యాన్ని చూపించి థియేటర్ దద్దరిల్లిపోయేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెంచేసి జనాలని భయపెట్టాలన్నది చాలా పాత టెక్నిక్. రాంగోపాల్ వర్మ పాత సినిమాలు రాత్రి, దెయ్యం లాంటి సినిమాల్లో ఆల్రెడీ చూసేసినవే.
analysis:
రాత్రి సినిమాలో అద్దంలో దెయ్యం కనిపిస్తుంది. ఈ సినిమాలో అద్దంలో మనిషి కనిపించడు అంతే తేడా... జనాలని వెర్రి వెంగలప్పలని చేసేయాలన్న సరదా రాంగోపాల్ వర్మకి ఎంత ఉందొ ఈ చిత్రం చూస్తేనే తెలుస్తుంది. ఇక క్లైమాక్స్ సీన్స్ ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే... ఆ సీన్స్ చూస్తుంటే దర్శక నిర్మాతల టేస్ట్, వారిలో ఉన్న సృజనాత్మకత మన కళ్ళముందు కనపడి కళ్ళనుండి కన్నీళ్ళు వచ్చేలా చేస్తాయి. హీరోపై ద్వేషం పెంచుకున్న ఆత్మ హీరో భార్యలోకి ప్రవేశిస్తుంది. హీరో ప్రేమించేవాళ్ళందరినీ చంపేస్తానని శపథం చేస్తుంది. అన్నట్టుగానే హీరో ప్రేమించే వారిని కాకుండా హీరోకి సహాయపడే వారిని చంపేస్తుంది... బాగానే ఉంది... అయితే హీరో ప్రాణప్రదంగా ప్రేమించే కూతురు రక్షని చంపే ప్రయత్నంలో హీరో భార్య పై అంతస్థునుండి క్రిందపడుతుంది.... హీరో భార్య చచ్చిపోతుంది.
కానీ ఆమెలో ప్రవేశించిన ఆత్మ ఆచూకీ మాత్రం కనిపించదు... అంటే హీరో భార్య చనిపోవడంతో హీరోపై ద్వేషం పెంచుకున్న ఆత్మ కూడా చనిపోయిందా...? హు...ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఉన్నాయి. కానీ ఇంక చెప్పాల్సింది ఏమీలేదు... రాంగోపాల్ వర్మ తీసిన శివ చిత్రాన్ని, క్షణక్షణం చిత్రాన్ని సర్కార్ చిత్రాన్ని ఒకటికి పదిసార్లు చూసిన నేను ఆయన నిర్మించిన ఈ చిత్రాన్ని ఇంతలా వ్యతిరేకించి వ్రాయాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు.
lastly::
నటీనటులు తమ పాత్రలకి తగ్గట్టుగా బాగానే చేశారు, సాంకేతికంగా సినిమా సీన్స్ భయపెట్టకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భయపెట్టేలా చేసాయి. అంతే తేడా... ఇంక చెప్పడానికి ఏమీ లేదు....