http://3.bp.blogspot.com/_AcBUSVxs82w/TL-11Z1kg5I/AAAAAAAAicM/-v4on07qcko/s1600/Nagarjuna_Ragada_Wallpapers.jpg
ragada review

Story
కడపలో ఉండే సత్యారెడ్డి (నాగార్జున)అనే దమ్మున్న కుర్రాడి తల్లి అక్కడ ఒక హాస్పిటల్ నడుపుతూ పేద ప్రజలకు సేవ చేస్తూ ఉంటుంది.కానీ అక్కడ ఎన్నికల్లో నిలబడ్డ ఒక రెడ్డిగారు ఆమె కుమార్తెను కిడ్నాప్ చేసి,ఆమెను తనకు మద్దతునిమ్మంటాడు. దానికామె నిరాకరిస్తుంది.అప్పుడామె కొడుకు వెళ్ళి తన చెల్లిని విడిపించుకొస్తాడు.గూండాగిరితో ఆమెనేం చేయలేనని తెలుసుకున్న అతను,ఆమెకు ఆ హాస్పిటల్ స్థాలాన్ని,ఆ భవనాన్ని తన తండ్రి నోటు,పత్రం లేకుండా ఇవ్వటం వల్ల,ఆ హాస్పిటల్ ఖాళీ చేయమని,లేదా ఆ స్థలం విలువ 87 కోట్లు తనకు చెల్లించాలనీ కోర్టు నుండి ఆర్డర్ తెస్తాడు ఆ రెడ్డి.ఆ డబ్బుని తాను తెస్తానని సత్యా హైదరాబాద్ కు బయలుదేరతాడు.ఇదంతా మనకు సినిమా సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది.ఇక హైదరాబాద్ కి వచ్చిన సత్య ఏం చేశాడు...?అంతడబ్బు ఎలా సంపాదించాడు...?అన్నది మిగిలిన కథ.
Analysis
వీరూ పోట్ల రెండవ సినిమాగండాన్ని విజయవంతంగా దాటాడని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది.ఎందుకంటే గతంలో రెండవ సినిమా తీసిన కొత్త దర్శకులు చాలా మంది ఫ్లాప్ లే ఇచ్చారు.అతను ఎలాంటి ప్రయోగాలకు పోకుండా రొటీన్ కథనే తీసుకుని,నాగార్జున పాత్రను కొత్తగా డిజైన్ చేసి,ఇద్దరు హీరోయిన్ల గ్లామర్ ని సక్రమంగా వాడుకుని,మాస్ కి కావలసిన యాక్షన్,డ్యాన్సులను కావలసినంత పుష్కలంగా ఈ సినిమాలో చేర్చి,చక్కని స్క్రీన్ ప్లే తో ఈ సినిమాని తీశాడని చెప్పాలి.ఈ సినిమా ఫస్ట్ హాఫంతా ఫుల్ గా ఎంటర్ టైన్ మెంట్ తో సాగి,సెకండ్ హాఫ్ లో కథ జోలికి వెళ్ళి, అనవసరమైన విషయాల జోలికి వెళ్ళి కథాగమనానికి ఆటంకం కలిగించకుండాఈ సినిమాని సింపుల్ గా ప్రేక్షకులనలరించేలా తీశాడు.



నటన - ఈ చిత్రంలో నాగార్జున గతంలో కె.డి.,కింగ్ సినిమాల్లో కన్నా బాగా గ్లామర్ గా కనిపిస్తున్నాడు.ఆయన డైటెంటో,ఆ గ్లామర్ రహస్యమేంటో ప్రేక్షకులకు కూడా చెపితే బాగుణ్ణు.ఎందుకంటే ఓ ఇరవైదేళ్ళ కుర్రాడిలా ఆయన ఈ చిత్రంలో కనిపించటం విశేషం.ఇక డ్యాన్సుల్లో, ఫైటుల్లో ఆయన స్పీడేం తగ్గలేదు సరికదా ఇంకాస్త పెరిగిందనే చెప్పాలి.ఆయన డైలాగుల్లో రాయలసీమ యాశను అతి కొద్దిగా మాత్రమే వాడటం మంచిదయ్యింది.ఆయన పాత్రకు తగ్గట్టుగా నడకలో స్టైల్,నిర్లక్ష్యం,ఆ బోడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో మనకు కొత్త నాగార్జునను చూపిస్తాయి.ఇక అనుష్క,ప్రియమణి ఒకరికొకరు పోటీపడి మరీ నాగార్జనతో రొమాన్స్ చేశారని చెప్పాలి.ముఖ్యంగా పాటల్లో.ఏమాటకామాటే చెప్పుకోవాలి ప్రియమణి కంటే అనుష్క మరికాస్త రొమాంటిక్ గా కనిపించింది.ఈ చిత్రంలో విలన్లు కావలసినంత మంది ఉన్నారు.వాళ్ళ నటనలో కొత్తదనం పెద్దగా ఏం లేదు.ఇక బ్రహ్మానందం కామెడి ఈ చిత్రంలో కొత్త పుంతలు తొక్కింది.తనను తాను ఎక్కువగా ఊహించుకునే పాత్రలో ఆయన చక్కని కామెడీ పండించారు.ఒక సినిమా షుటింగ్ లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం,మాస్టర్ భరత్ క్రీస్టియన్ ప్రీచ్ మనకు నవ్వు తెప్పిస్తుంది.
సంగీతం - ఈ సినిమాలోని పాటలన్నీ బాగున్నాయి.ఆ విషయం నిన్ననే జరిగిన ఆ చిత్రం ఆడియో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షనే నిరూపించింది.ఈ రోజు పాటల గురించి కొత్తగా వ్రాయాల్సిన పని లేదు.స్క్రీన్ మీద ఆ పాటలు మరింత బాగున్నాయి.ఇక రీ-రికార్డింగ్చాలా బాగుంది.ప్రతి సీన్ మూడ్ ని ఎలివేట్‍ చేసే విధంగా ఈ చిత్రంలోని రీ-రికార్డింగ్ ఉంది.
సినిమాటోగ్రఫీ - చాలా బాగుంది.ఈ సినిమాలో తారలంతా అంత గ్లామరస్ గా కనపడటానికి సర్వేష్ మురారి కెమెరా పనితనం ముఖ్య కారణమని చెప్పాలి.లైటింగ్ స్కీమ్ కూడా బాగుంది.పాటల్లో,ఫైటుల్లో కెమెరా పనితనం బాగుంది.
మాటలు - ఈ చిత్రంలోని మాటలు దర్శకుడు వీరూ పోట్లే వ్రాయటంతో,మాటలు ఎంతవరకూ అవసరమో అంతవరకే సూటిగా,క్లుప్తంగా ఉన్నాయి.మాటల్లో కామెడీ పంచ్ లు కూడా బాగున్నాయి.ఉదాహరణకు నాగార్జునతో బ్రహ్మానందం చెప్పే "నీ మెదడు సింగిల్ థియేటర్ వంటిది.ఒక సినిమానే ఆడుతుంది.నా మెదడు ఐమ్యాక్స్ థియేటర్ వంటిది.ఒకేసారి నాలుగు సినిమాలు ఆడతాయ్",నాగార్జున దేవ్ గిల్ తో చెప్పే "ఇంగ్లీష్ లో ఒక సామెతుంది.ఏ ఆయుధంతో తిరిగే వాడు ఆ ఆయుధంతోనే ఛస్తాడని","నచ్చితే చెరుకుగడ.నచ్చకపోతే రగడ"వంటి మాటలు సందర్భోచితంగా ఉండి బాగున్నాయి.
పాటలు - ఈ చిత్రంలోని పాటలు యువతను ఉర్రూతలూగిస్తాయనటంలో సందేహం లేదు.ఈ చిత్రంణలోని పాటలన్నీ రామజోగయ్య శాస్త్రే వ్రాయటం విశేషం.ఈ సినిమా నిర్మాత తన ప్రతి చిత్రానికీ రామజోగయ్య శాస్త్రే పాటల రచయితని ప్రకటించాడంటేనే ఆయనెలా వ్రాశాడో మనం అర్థం చేసుకోవచ్చు.అలాగే ఏనాడూ పాటల రచయిత గురించి పెద్దగా మాట్లాడని హీరో నాగార్జున కూడా శాస్త్రి ఈ చిత్రంలో పాటలు బాగా వ్రాశాడని కితాబివ్వటాన్ని బట్టి పాటలు బాగున్నాయని తెలుస్తుంది.ఈ చిత్రం ఆడియో ఇప్పటికే పెద్ద హిట్టు.
ఎడిటింగ్ - చాలా నీట్ గా క్రిస్ప్ గా,అనవసరమైన షాట్ ఒక్కటి కూడా లేకుండా,ఈ చిత్రం ఫ్రేమ్ టు ఫ్రేమ్ పరిగెత్తే విధంగా ఎడిటింగ్ ఉంది.
ఆర్ట్ - చాలా చాలా బాగుంది.పాటల్లో సెట్స్ కన్నుల పండుగ్గా ఉన్నాయి.
కొరియోగ్రఫీ -ఈ చిత్రంలోని కొరియోగ్రఫీ అన్ని పాటల్లోనూ అద్భుతంగా లేకపోయినా బాగుంది.
యాక్షన్ - మాస్ ప్రేక్షకులకి ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు చూస్తే కన్నుల పండగే.ఈ సినిమాలో యాక్షన్ కావాలనుకునే ప్రేక్షకులకు కావలసినంత యాక్షన్ ఉంది.
TeluguOne Perspective
ఈ సినిమా చూస్తుంటే నాగార్జునకు చాలా కాలం తర్వాత ఒక హిట్టు వచ్చిందనిపిస్తుంది.ఈ సినిమా అవుట్ అండ్ మాస్ చిత్రం.నాగార్జున లాంటి క్లాస్ హీరో,మాస్ చిత్రం చేస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రం అలా ఉంది.ఈ చిత్రంలో కావలసినంత ఎంటర్ టైన్ మెంటుంది.ఈ సినిమాని ధైర్యంగా చూడవచ్చు.