బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
తారాగణం: వరుణ్ సందేశ్, శశాంక్, నిషా అగర్వాల్, మధు శర్మ, వెన్నెల కిషోర్, ఎమ్.ఎస్. నారాయణ, ప్రగతి, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, ఝాన్సీ తదితరులు
సంగీతం: చక్రి
సినిమాటోగ్రఫీ: బుజ్జి
నిర్మాత: రాదా మోహన్
దర్శకత్వం: సంపత్ నంది
హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం ఇచ్చిన కిక్ తో రెండు చేతులా సినిమాలు చేస్తున్న వరుణ్ సందేష్ సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఇప్పుడు మరో ప్రయత్నంగా వరంగల్ నుంచి వచ్చి అమీర్ పేట్ లో సాఫ్ట్ వేర్ జాబ్ కోసం ట్రై చేస్తూ ప్రేమలో పడే కుర్రాడి పాత్రలో నటించిన 'ఏమైంది ఈ వేళ' సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ సత్య సాయి మూవీస్ పతాకం ఫై గతంలో జగపతి బాబు తో అధినేత చిత్రాన్ని నిర్మించిన రాధా మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంపత్ నంది దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమా ద్వార కాజల్ చెల్లి నిషా హీరోయిన్ గా పరిచయం అయ్యింది. శశాంక్, నిషా షా, ఝాన్సీ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. చక్రి సంగీతం సమకూర్చారు. మొత్తానికి పెద్దగా ప్రచారం లేకుండా సైలెంట్ గా విడుదల అయిన ఈ సినిమా వరుణ్ సందేశ్ కెరీర్ కు ప్లస్సో, మైనస్సో ఈ సమీక్షలో చూద్దాం.
కధ:
పెళ్ళయి విడిపోయిన శ్రీను (వరుణ్ సందేశ్), అవంతిక (నిషా అగర్వాల్) వేరు వేరుగా రెండోపెళ్ళి చేసుకోవడానికి రెడీ అవడంతో మొదలవుతుంది 'ఏమైంది ఈ వేళ' సినిమా. శ్రీను పెళ్ళి చేసుకోవాలి అనుకునే నిమిషా తోనూ, అవంతిక తన కోసం చుసిన శశాంక్ తోనూ తమ గతాన్ని చెబుతూ ఉంటారు. శ్రీను వరంగల్ నుండి, అవంతిక బాపట్ల నుండి సాఫ్ట్ వేర్ ఉద్యోగాల వేటలో అమీర్ పేట్ వచ్చి చేరతారు. ఎప్పటిలానే ఓ సంఘటన తో ఇద్దరి మద్య గొడవతో మొదలైన పరిచయం స్నేహంగా మారుతుంది. అది కాలక్రమేణ బలపడి ప్రేమగా రూపాంతరం చెందుతుంది. తోలి వలపు లోని మోజుతో శారీరకంగా కూడా దగ్గర అవుతారు. తరవాత ఉద్యోగాలు సంపాయించి పెద్దలను ఎదురించి పెళ్ళి చేసుకుని హ్యాపీగా గడుపుతూ ఉంటారు. కాలం ఎప్పుడు ఒకలానే ఉండదుగా అందులోను ప్రేమించి పెళ్ళి చేసుకున్నవాళ్ళు, ఫైగా ఉద్యోగాలు చేస్తున్నారు. చిన్న తగువును ఇగోతో పెద్దది చేసుకుని గొడవపడి విడాకులు తీసుకుని మరో పెళ్ళికి సిద్దం అవుతారు. ఇదంతా విని వీళ్ళను పెళ్ళి చేసుకునేవాళ్ళు ఆలోచనలో పడతారు. ఇక చివరికి ఏమి జరగవచ్చో, సినిమా ఎలా ముగుస్తుందో సినిమాలు చూసే వాళ్ళకి, మరి ముక్యంగా తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.
విశ్లేషణ:
ప్రేమించడం, పెళ్ళి చేసుకోవడం, విడిపోవడం మళ్ళి కలవడం ఇలాంటి కధలు చాలానే చూసి ఉన్నాం. సాఫ్ట్ వేర్ కల్చర్ ప్రేమ, పెళ్ళి సినిమాలు కూడా ఇప్పటికే రెండు మూడు చూసాం. కానీ 'ఏమైంది ఈ వేళ' లో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఏమిటంటే హైదరాబాద్ లోని అమీర్ పేట్ ను కధలోకి తీసుకు రావటం. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల వేటకు బయలుదేరేవారి ప్రయాణం అమీర్ పేట్ నుండే మొదలవుతుంది. అదే పాయింట్ తో మొదలైన కధ తరవాత ప్రేమ వైపు మళ్ళి రొటీన్ సినిమాలా తయారయింది. దర్శకుడు సంపత్ నంది అమీర్ పేట్ ను ఫైఫైన తడిమి చూసాడు కానీ లోతుకెళ్ళి చూడలేదు. ఇరుకు రోడ్డులు, కోచింగ్ కు వచ్చే జనాలు, నెట్ కేఫ్ సరసాలు మాత్రమే కాదు. అక్కడికి వచ్చే వారి జీవితాల్లో ఎన్నో కోణాలు ఉంటాయి. జాబ్ లేని జీవితం, జాబ్ తరవాత జీవితం ఎంత మార్పుగా ఉంటుందో కాస్తంత రిసర్చ్ చేసినట్టయితే ఈ సినిమా కూడా మరో హ్యాపీడేస్ అయ్యేది. కొత్తగా సినిమా తీసేవాళ్ళు కొత్తగా తియ్యాలి ఎవరో చేసిన విదంగానో, ఇంతకు ముందు ఎవరో తీసిన దాన్ని మళ్ళి తియ్యడంలో గొప్పేముంది ఈ విషయాన్నీ సంపత్ నంది గమనించాలి. వరుణ్ సందేశ్ మనకు అలవాటైన విధంగానే కనిపించాడు వెరైటి అనేది లేకుండా. కొత్తగా పరిచయం అయిన నిషా అగర్వాల్ పర్వాలేదు అనిపిస్తుంది. మిగతా పాత్రలు తమ పరిదిమేర నటించారు. దాదాపు సినిమా అంతా హీరో హీరోయిన్ మాత్రమే చాలాభాగం కనిపిస్తారు, దాంతో నటించడానికి మిగతావారికి అంతగా అవకాశంలేదు. వెన్నెల కిషోరే సినిమా చూస్తున్నంతసేపు కాస్త జనాన్ని రిలాక్స్ చేస్తాడు. తెరముందు పనిచేసిన వాళ్ళు కానీ, తెరవెనుక పనిచేసిన వాళ్ళు కానీ ఎవరిపని పెద్దగా మెచ్చుకునే విదంగా లేదు.
ప్లస్ పాయింట్స్:
వెన్నెల కిషోర్ కామెడీ మాత్రమే ఈ సినిమాకి ప్లస్. మ్యూజిక్ ఇచ్చిన చక్రి రెండు పాటలు బాగున్నాయి.
మైనస్ పాయింట్స్:
వీక్ స్క్రీన్ ప్లే, ఈ సినిమాకు పెద్ద మైనస్. ఏ విబాగం లోను కొత్తదనం అనేది మచ్చుకకు కూడా కనిపించదు.
కొస మెరుపు:
గతంలో వచ్చిన 'అప్పుడప్పుడు', 'పెళ్ళైన కొత్తలో' సినిమాలు చుస్తే మాత్రం ఈ సినిమాను పట్టించుకోవలసిన అవసరంలేదు.